మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కల్ట్ హిట్ చిత్రం 'కొబ్బరిమట్ట' మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వర్సటైల్ హీరో సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ హిలేరియస్ మూవీని ప్రముఖ రైటర్, ప్రొడెక్టర్ సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. రూపేష్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, సినిమాలోని డైలాగ్స్ సోషల్ మీడియాలో ఎప్పటికీ ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ తేదీని ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ తన కెరీర్‌లో 'కొబ్బరిమట్ట' ఎంతో ప్రత్యేకమైన సినిమా అని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా రూపకల్పన సమయంలో తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఆ నాలుగేళ్ల కష్టాన్ని ప్రేక్షకులు మొదటి రోజు మ్యాట్నీ షోలతోనే మర్చిపోయేలా అద్భుతమైన విజయాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. సంపూర్ణేష్ బాబుతో చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రంలో మూడు నిమిషాలకు పైగా సాగే నాన్-స్టాప్ డైలాగ్స్ ఇన్నేళ్లయినా ప్రేక్షకుల గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. అభిమానుల కోరిక మేరకు సంపూ కోసం ఈ నెల 14న ఈ చిత్రాన్ని పరిమిత థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ సాయి రాజేష్‌తో తన ప్రయాణం ఎప్పటికీ మరువలేనిదని, ఈ సినిమాలో తాను మూడు పాత్రల్లో నటించడంతో పాటు మూడు నిమిషాల ఇరవై సెకన్ల భారీ డైలాగ్‌ను చెప్పడం ఒక సవాల్‌గా అనిపించిందని తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ, ప్రేక్షకులు అందించిన ఆదరణ ఆ కష్టాలన్నింటినీ మరిచిపోయేలా చేసిందని పేర్కొన్నారు. చాలా కాలంగా అభిమానులు 'కొబ్బరిమట్ట'ను రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారని, సాయి రాజేష్‌తో చర్చించి ఈ నెల 14వ తేదీని దీనికోసం ఎంపిక చేశామని చెప్పారు. ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు.
ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ఏర్పాట్లు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఒకపక్క బేబి సినిమా విజయంతో అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్న సాయి రాజేష్, త్వరలోనే బేబి హిందీ రీమేక్ మరియు కొత్త తెలుగు ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. నవ్వుల సంద్రం పంచే 'కొబ్బరిమట్ట' సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో సంపూర్ణేష్ బాబు అభిమానులు మరియు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.