అన్ని పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీబీజీ రామ్ జీ పథకం ద్వారా పాఠశాలలు, వసతి గృహాల్లో వర్షపు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా కమ్యూనిటీ సోక్‌పిట్స్, రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాలలు, వసతి గృహాల్లో అంతర్గత రహదారులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి నిరంతర నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన ప్రహరీ గోడలు, విద్యుత్ పనులు, నూతన భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పెండింగ్ పనులను హామ్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆధార్, కుల, నివాస తదితర ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ఈ నెల 23లోగా దరఖాస్తులు చేయించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డీఈవో సుశీందర్ రావు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.