మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు
పర్చూరు, మేజర్‌న్యూస్ :
మురసు తుపాను కారణంగా దెబ్బతిన్న సాగునీటి కాలువలు, డ్రైన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.8.63 కోట్లు మంజూరు చేసింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తుల మేరకు 116 అత్యవసర మరమ్మతు పనులకు నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పరిపాలనా అనుమతులు జారీ చేశారు. మొత్తం రూ.863.19 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నారు.
నవంబరు 3న సంభవించిన మురసు తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో 336.20 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. గుంటూరు, పల్నాడు జిల్లాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు నల్లమడ, రొంపేరు పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. కొమ్మమూరు కాలువతో పాటు పర్చూరు వాగు, రొంపేరు, ఆలేరు, సాకి వాగు, కప్పల వాగు తదితర కాలువలు, డ్రైన్ల గట్లు కోతకు గురయ్యాయి. పలుచోట్ల గండ్లు పడటంతో పాటు షట్టర్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఈ నేపథ్యంలో దెబ్బతిన్న సాగునీటి వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అత్యవసర మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆయన కృషితో నీటిపారుదల శాఖ పరిధిలో 72 పనులకు, డ్రైనేజీ విభాగం పరిధిలో 44 పనులకు అనుమతులు లభించాయి.
మండలాల వారీగా పనులు ఇలా..
కారంచేడు మండలంలో అత్యధికంగా 54 పనులకు అనుమతులు లభించాయి. వీటిలో నీటిపారుదల శాఖ పరిధిలో 30, డ్రైనేజీ విభాగంలో 24 పనులు ఉన్నాయి. కొమ్మమూరు కాలువ, శాకి న్యూ సైడ్ ఛానల్, కారంచేడు పాత, కొత్త కాలువలు, బెంజమిన్ ఛానల్‌తో పాటు పర్చూరు వాగు, రొంపేరు ఎడమ కాలువ, ఆలేరు డ్రైన్, కప్పల వాగులకు మరమ్మతులు చేపట్టనున్నారు.
పర్చూరు మండలంలో 38 పనులు మంజూరయ్యాయి. నీటిపారుదల శాఖ పరిధిలో 22, డ్రైనేజీ విభాగంలో 16 పనులు చేపట్టనున్నారు. కొమ్మమూరు కాలువ గట్ల పటిష్టత, ఆర్‌పీ స్కీమ్ ప్రధాన, బ్రాంచ్ కాలువల మరమ్మతులతో పాటు పర్చూరు వాగు, సాకి వాగు గండ్ల పూడ్చివేత, కోతల నివారణ పనులు చేపట్టనున్నారు.
చిన్నగంజాం మండలంలో 24 పనులకు అనుమతులు వచ్చాయి. వీటిలో నీటిపారుదల శాఖ పరిధిలో 20, డ్రైనేజీ విభాగంలో నాలుగు పనులు ఉన్నాయి. కొమ్మమూరు కాలువ, పెదగంజాం, కనపర్తి, ఈమిలేరు సప్లై ఛానళ్లతో పాటు ఆలేరు, అప్పేరు, రొంపేరు కుడి కాలువ డ్రైన్లకు మరమ్మతులు చేయనున్నారు.
నిధులు మంజూరు కావడంతో దెబ్బతిన్న సాగునీటి కాలువలు, డ్రైన్లకు త్వరలోనే మరమ్మతులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. పనులు వేగంగా పూర్తిచేస్తే సాగునీటి వ్యవస్థకు పూర్వవైభవం రావడంతో పాటు భవిష్యత్తులో వరదల సమయంలో పంట పొలాలకు నష్టం తగ్గుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.