గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 20:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 2026లో నిర్వహించనున్న రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పోలింగ్ జరిగే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంలో భాగంగా నవంబర్ 26, నవంబర్ 29 మరియు డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ జరగనుందన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఆయా పోలింగ్ తేదీల్లో స్థానిక సెలవు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అయితే ఈ స్థానిక సెలవు జిల్లా మొత్తం వర్తించే సాధారణ సెలవు కాదని, ఆయా తేదీల్లో పోలింగ్ నిర్వహించే ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే, విధుల అత్యవసర పరిస్థితులకు లోబడి సంబంధిత పోలింగ్ రోజున కార్యాలయానికి ఆలస్యంగా రావడం, ముందుగా వెళ్లడం లేదా కొంత సమయం విధుల నుంచి విరామం తీసుకోవడం ద్వారా ఓటు వేసేందుకు అనుమతి కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.