బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్ పర్సన్ గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తదుపరి వారికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. బాపట్ల జిల్లా ఏర్పడిన అనంతరం జిల్లా ప్రజా పరిషత్ నూతన పరిపాలన సంస్థకు ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి బాధ్యతలు స్వీకరించారు. వైస్ ఛైర్ పర్సన్ గా కలవకూరి పిచ్చమ్మ బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, శాసనమండలి సభ్యులు పోతుల సునీత, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు అభినందనలు తెలిపారు. పూల మొక్కలతో వారిని అభినందించారు.
బాపట్ల లోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, ఏపీవోగా జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి వ్యవహరించారు. మొదట 20 మంది జెడ్పీటీసీ సభ్యులతో జిల్లా ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి సభ్యులందరికీ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. మధ్యాహ్నం 1:50 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ల పదవులకు నామినేషన్ దాఖలు చేసుకోవాలని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. మధ్యాహ్నం రెండు గంటలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి స్వీకరించారు. ఒక్కొక్క పదికి ఒక్కొక్క నామినేషన్ రావడంతో రెండు పదవులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. మధ్యాహ్నం 2:05 గంటలకు చైర్మన్, వైస్ ఛైర్ పర్సన్ పదవులకు ఎన్నికైన వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 2:12 గంటలకు బాపట్ల జిల్లాలో మొట్టమొదటి జిల్లా పరిషత్ నూతన పరిపాలన పాలకవర్గం సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2:52 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ లు బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డిఓ హరికుమార్, అధికారులు, 18 మంది జడ్పిటిసి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.