రేవంత్ రెడ్డి తీరుతో కలుషితమవుతున్న తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి
గజ్వేల్ ; .రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా.వంటేరు యాదవ రెడ్డి ఆక్షేపించారు. శుక్రవారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, విమర్శలు సహజమేనని, అయితే రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం అభ్యంతరకరమని అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు. హరీష్ రావు రాజకీయాలను విమర్శించాలంటే ఆయన చేసిన పనులు, విధానాలు విమర్శించాలని, వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రాగా, ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే రెండేళ్ల సమయంలో నైనా తెలంగాణ ప్రజలను అర్థం చేసుకుని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిర్మించిన ప్రాజెక్టులపై విమర్శలు చేయడం కాకుండా పంటలకు సాగు నీటిని అందించడంపై దృష్టి పెట్టాలని, రిజర్వాయర్లలో నీటిని నింపకుండా, బద్నాం చేస్తూ రైతులకు తీవ్ర ద్రోహం చేస్తూ, క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులను తేవడం ఏమిటని ప్రశ్నించారు.కేసీఆర్ అమలు చేసిన రైతు బీమా పథకం కుటుంబంలో భూమి ఉన్న అర్హులైన రైతులకు ప్రయోజనం కల్పించగా, ఇప్పుడు దాని విధానాన్ని మార్చి ఒక్కరికే వర్తించేలా చేయడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని నిలదీశారు. రైతు సంక్షేమం పేరుతో పథకాల స్వరూపాన్ని మార్చి వారి ప్రయోజనాలను దెబ్బతీయడం సరికాదని, ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదని, తెలంగాణ కోసం పోరాడిన అమరులు, ఉద్యమకారులు, పేర్లు పెట్టాలని చెప్పారు.
ఢిల్లీ పెద్దల మెప్పు కోసం, కుర్చీని కాపాడు కోవడం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టవద్దని అన్నారు.
పాలనలో పెత్తనం, వసూళ్లు ఇతరుల చేతుల్లో ఉన్నాయనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తుండగా, వాటిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా రేవంత్ రెడ్డి భాషలో, విమర్శల తీరులో ఎలాంటి మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నాయకుడూ ఉపయోగించని భాష మాట్లాడడం తెలంగాణ రాజకీయ సంస్కృతికి మంచిది కాదని, పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉందని వివరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, నాయకులు రమేష్, కన్నా తదితరులు పాల్గొన్నారు.