BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

సిద్దిపేట అభివృద్ధికి.. తెలంగాణ ఉద్యమానికి మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయం!

Select Suryaa Now
సిద్దిపేట అభివృద్ధికి.. తెలంగాణ ఉద్యమానికి మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయం!

సిద్దిపేట అర్బన్,  : సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలందించిన తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కీర్తిశేషులు అనంతుల మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయమని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హెచ్. హనుమంతరావు కొనియాడారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆయన సేవలకు దక్కిన సముచిత గౌరవమని హర్షం వ్యక్తం చేశారు.

శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ మదన్ మోహన్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

నిజాం కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించిన మదన్ మోహన్ న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి, అనంతరం ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారని వివరించారు. 1970లో సిద్దిపేట ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు.

పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో పలు కీలక మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య, సాంకేతిక విద్య, న్యాయ, వాణిజ్య పన్నుల శాఖల్లో మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని చెప్పారు. ముఖ్యంగా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఏర్పాటుకు కీలకంగా కృషి చేశారని వివరించారు.

1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం శాసనసభలో ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా వ్యవహరించారని తెలిపారు. సిద్దిపేట రాజకీయ చరిత్రలో మదన్ మోహన్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన ప్రజాసేవా దృక్పథం, రాజకీయ విలువలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు.

ఇటీవల నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు కీర్తిశేషులు అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించడం అభినందనీయమని హనుమంతరావు పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప నాయకుడి సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే నిర్ణయమని, మదన్ మోహన్ ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అన్న సేవలకు గుర్తింపు.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

ఈ సందర్భంగా మదన్ మోహన్ సోదరుడు, ప్రభుత్వ క్రమశిక్షణ కమిషన్ చైర్మన్ శ్యామ్ మోహన్ మాట్లాడుతూ తమ అన్న అనంతుల మదన్ మోహన్ చేసిన సేవలను, ఆశయాలను గుర్తించి ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. మదన్ మోహన్ సేవలకు తగిన గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట సీనియర్ నాయకుడు గంప మహేందర్, సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హత్తు ఇమామ్, మహిళా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రేణుకతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.