పాలమాకుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నంగునూరు:-జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొనుగోలు ప్రక్రియ, కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతుల ధాన్యంలో తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉన్న వెంటనే కొనుగోలు ప్రక్రియ చేపట్టి లోడ్ చేయాలని సూచించారు. మిల్లర్ల వైపు నుంచి ధాన్యం తరలింపు లేదా ఇతర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ధాన్యం తూకంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, సుత్లీ, తూకం యంత్రాలు, తాగునీరు తదితర అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రైతులు కేంద్రాలకు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యాలు ఎదురుకాకుండా, వారి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేలా కేంద్ర సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి అందిస్తున్న బోనస్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, కొనుగోలు కేంద్ర సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.