బాడంగి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
బాడంగి, నవంబరు 20 (మేజర్ న్యూస్): బాడంగి స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నవంబరు 14 నుంచి వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో డి.వి.ఎస్. శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులు, యువత సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఎస్సై పి.సూర్యకుమారి మాట్లాడుతూ పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు మంచి ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు పి.దేవకుమార్, ఎస్.బాలదొర, ఎంఈవో రాజేశ్వరి, స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి సహకరించిన అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాఠకుల సంఘం సభ్యులను ఘనంగా సత్కరించారు. గ్రంథాలయాధికారి ఆర్.దుర్గా ప్రసాద్, కమిటీ సభ్యుడు వై.రవిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.