ఎస్.వి. కళాశాలలో పోలీసుల అవగాహన.. 450 మంది విద్యార్థులకు పాఠం
చిత్తూరు అర్బన్ , మేజర్ న్యూస్:
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా చిత్తూరులోని ఎస్.వి. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు.క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు, సోషల్ మీడియా ఇన్‌స్పెక్టర్ నిత్య బాబు మహిళలు, చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై అవగాహన కల్పించారు.క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు జరిగితే భయపడకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. గుర్తుతెలియని కాల్స్, సందేశాలు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని, సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.సోషల్ మీడియా ఇన్‌స్పెక్టర్ నిత్య బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని చెప్పారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవద్దని, నకిలీ ఖాతాలు, ఆన్‌లైన్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ లేని సమాచారాన్ని పంపకూడదని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని వివరించారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్