అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన
సూర్య బిజినెస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నియంత్రణపరమైన సడలింపులు కల్పించే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక ప్రతిపాదన చేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు వెల్లడి నిబంధనలను తొలగించాలని కోరుతూ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. విదేశీ మదుపర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలోని మార్పులు, అలాగే ఇటీవల కాలంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2026 మధ్య కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి 5.61 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నట్లు సెబీ గణాంకాలు వెల్లడించాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, తమ దేశీయ ఈక్విటీ ఆస్తుల్లో 50 శాతానికి మించి ఒకే కార్పొరేట్ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు లేదా వ్యక్తిగతంగా లేదా ఇన్వెస్టర్ గ్రూప్‌తో కలిసి 50 వేల కోట్ల రూపాయలకు మించి ఈక్విటీ ఆస్తులు కలిగిన సంస్థలు లబ్ధిదారుల యాజమాన్య వివరాలను మరింత వివరంగా వెల్లడించాల్సి ఉండేది. అమెరికా, బ్రిటన్, సింగపూర్, జపాన్, హాంకాంగ్ వంటి ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో లబ్ధిదారుల యాజమాన్య గుర్తింపు పరిమితి సాధారణంగా 25 శాతంగా ఉండగా, భారత్‌లో మనీ లాండరింగ్ నిరోధక నిబంధనల ప్రకారం సంస్థ స్వరూపాన్ని బట్టి 10 శాతం లేదా 15 శాతంగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే కఠినమైన నిబంధనలు విదేశీ పెట్టుబడుల కేటాయింపుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెబీ తన నివేదికలో పేర్కొంది.
అదనపు వెల్లడి నిబంధనలను తొలగించడంతో పాటు, ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ సబ్‌స్క్రైబర్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిర్వహించే ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలకు సంబంధించిన అదనపు వెల్లడి నిబంధనలను కూడా ఉపసంహరించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రతిపాదించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నియంత్రణ వ్యవస్థను తీర్చిదిద్దడం ద్వారా మార్కెట్ పోటీతత్వం పెరుగుతుందని, విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి మార్గం సుగమమవుతుందని ఆశిస్తోంది.
ఈ ప్రతిపాదనలపై ప్రజలు, మార్కెట్ వర్గాల నుంచి డిసెంబర్ 11 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు సెబీ తెలిపింది. నియంత్రణపరమైన నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా మదుపర్ల విశ్వాసాన్ని పెంచడం, రూపాయి మారకం విలువ, విదేశీ మారక మార్కెట్లపై ఉన్న ఒత్తిడిని తగ్గించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో వాటాదారుల అభిప్రాయాలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సెబీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.