డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు
సూర్య బిజినెస్ డెస్క్: కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరణతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, పర్యావరణ ప్రభావాలను నియంత్రించేందుకు స్పెయిన్ ప్రభుత్వం డేటా సెంటర్లపై కఠిన హరిత ప్రమాణాలను అమలు చేసే దిశగా ముందడుగు వేసింది. పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పర్యావరణ సుస్థిరత, ఇంధన సామర్థ్యం, డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఈ నిబంధనలను రూపొందించింది. విస్తారమైన భూభాగం, పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత కారణంగా ఐరోపాలో ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న స్పెయిన్ తీసుకున్న ఈ నిర్ణయం మదుపర్లు, సాంకేతిక సంస్థలలో చర్చనీయాంశంగా మారింది.
కొత్త నిబంధనల ప్రకారం, 1 మెగావాట్ లేదా అంతకంటే ఎక్కువ గ్రిడ్ యాక్సెస్ సామర్థ్యం ఉన్న కొత్త డేటా సెంటర్లు తమ విద్యుత్ వినియోగంలో కనీసం 80 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే 18 నెలల ముందు వరకు కొత్తగా ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా ఈ సరఫరాను అనుసంధానం చేయాలనే నిబంధనను పొందుపరిచారు. విద్యుత్, నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడంతో పాటు, డేటా మరియు సంబంధిత కార్యకలాపాల నియంత్రణ యూరోపియన్ యూనియన్ చట్టాలకు లోబడి ఉండేలా చర్యలు తీసుకున్నారు.
నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో గ్రిడ్ రుసుములపై అదనపు సర్‌ఛార్జీలు విధించడం నుంచి, తీవ్రమైన, పునరావృత ఉల్లంఘనల సందర్భంలో గ్రిడ్ కనెక్షన్, యాక్సెస్ అనుమతులను రద్దు చేసే వరకు కఠిన చర్యలు ఉండేలా నిబంధనలను రూపొందించారు. అలాగే 500 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ ఐటీ విద్యుత్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఇంధన, పర్యావరణ పనితీరు వివరాలను క్రమం తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది.
మరోవైపు ఈ కఠిన నిబంధనల వల్ల ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చులు పెరగడం, ఆలస్యాలు జరగడం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభావం పడే అవకాశం ఉందని డేటా సెంటర్ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే హరిత ఇంధన లక్ష్యాలు, విద్యుత్ గ్రిడ్ స్థిరత్వం, దీర్ఘకాలిక సుస్థిరత కోసమే ఈ ప్రమాణాలు అవసరమని స్పెయిన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో నిబంధనల తుది అమలు, పరిశ్రమ వర్గాల స్పందనపై అంతర్జాతీయ సాంకేతిక, ఆర్థిక రంగాలు నిశితంగా గమనిస్తున్నాయి.