పేపాల్ నూతన సీఎఫ్ఓగా క్లైర్ బ్రామ్లీ నియామకం
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా క్లైర్ బ్రామ్లీని నియమించింది. జేమీ మిల్లర్ స్థానంలో ఈవీపీ, సీఎఫ్ఓగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంస్థ శుక్రవారం వెల్లడించింది. క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థ జిరోలో సీఎఫ్ఓగా పనిచేస్తున్న క్లైర్ బ్రామ్లీ, పేపాల్‌లో తన కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు.
మూడేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే దిశగా పేపాల్ తన ఉన్నత నాయకత్వ బృందంలో పలు కీలక మార్పులు చేసింది. సుజాన్ కెరీర్‌ను పేమెంట్స్ సర్వీసెస్ మరియు డిజిటల్ అసెట్స్ విభాగాలకు అధ్యక్షురాలిగా నియమించగా, కన్జ్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు వెన్‌మో విభాగాల బాధ్యతలను కార్తీక్ మణికి అప్పగించింది. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో గ్లోబల్ నెట్‌వర్క్ సర్వీసెస్, భాగస్వామ్యాల విభాగానికి కార్తీక్ మణి నేతృత్వం వహించారు.
సుజాన్ కెరీర్ గతంలో ఫిసర్వ్ సంస్థలో చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ విభాగాధిపతిగా పనిచేశారు. పేపాల్‌లో గ్లోబల్ మార్కెట్లను పర్యవేక్షిస్తూ మర్చంట్ వ్యాపారంలో లాభదాయకతను పెంచడంపై దృష్టి సారించిన ఆమె, ఇప్పుడు డిజిటల్ ఆస్తుల విభాగాన్ని కూడా పర్యవేక్షించనున్నారు.
మూడేళ్ల వ్యూహాత్మక ప్రణాళిక అమలు పురోగతికి సంబంధించిన వివరాలను నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా వెల్లడిస్తామని పేపాల్ తెలిపింది. డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక సేవల విస్తరణలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ ఈ ఉన్నత స్థాయి నియామకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.