telangana
సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు
బంట్వారం, మేజర్ న్యూస్ : రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి నాణ్యమైన పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బంట్వారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (పరిగి), ఆత్మ సంయుక్తంగా మామిడి రైతులకు సేంద్రియ, ప్రకృతి సాగు ధ్రువీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఆర్‌పీఎల్ కార్యక్రమంలో భాగంగా సేంద్రియ ధ్రువీకరణ పొందే విధానాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వాటి ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ అధికారి లావణ్య, డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ సేంద్రియ సాగుతో పాటు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. నేలలో తేమను నిల్వ ఉంచుకునే పద్ధతులను వివరించారు.అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త ఉమారాజశేఖర్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భారతి రైతుల పొలాలను సందర్శించి పత్తి, కంది పంటలను పరిశీలించారు. కంది పంటలో పూత రాలకుండా తీసుకోవాల్సిన పోషక యాజమాన్య చర్యలు, పురుగులు, తెగుళ్ల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులపై రైతులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి కమల, మండల వ్యవసాయ అధికారి శ్రావ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు మచ్చేందర్, రైతులు వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి, హర్షవర్ధన్, మహేశ్, సిద్ధిరాములు, బిచ్చప్ప, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.