అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి
నంగునూరు:- అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అందేలా అత్యంత పారదర్శకంగా దరఖాస్తులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.శుక్రవారం నంగునూరు మండలం పాలమాకుల రైతువేదికలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని తెలిపారు.
నిన్న మన జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించే గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.గ్రామాల్లో నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియను, అర్హులైన కుటుంబాల వివరాల సేకరణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగకుండా లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆధార్, రేషన్ కార్డు తదితర వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని, అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా పథకం ప్రయోజనాలకు దూరం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏంపిడిఓ, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.