ప్రపంచ వాతావరణ నాయకత్వంపై చైనా వెనకడుగు
సూర్య అంతర్జాతీయ డెస్క్: అంతర్జాతీయ వాతావరణ దౌత్యంలో అమెరికా వైదొలగడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు చైనా ముందుకు రావడం లేదని స్పష్టమవుతోంది. టర్కీలోని అంటాల్యా నగరంలో జరుగుతున్న కాప్31 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో చైనా ప్రతినిధి బృందం అతి తక్కువగా, సంప్రదాయబద్ధమైన నిశ్శబ్ద వైఖరినే అనుసరిస్తోంది. ఒకవైపు ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక వద్ద అధ్యక్షుడు జిన్పింగ్ తన దౌత్య ప్రభావాన్ని చాటుకుంటుండగా, మరోవైపు కాప్31 సదస్సులో మాత్రం వాతావరణ నాయకత్వ బాధ్యతల పట్ల బీజింగ్ ఆసక్తి చూపడం లేదని దౌత్య వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2028లో జరగనున్న కాప్33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే అంశాన్ని గతంలో పరిశీలించినప్పటికీ, ఇప్పుడు ఆతిథ్య బాధ్యతల నుంచి చైనా తప్పుకున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ వాతావరణ చర్చల్లో చైనా తన పాత వైఖరికే కట్టుబడి, అభివృద్ధి చెందుతున్న దేశాల పక్షాన నిలుస్తోంది. సంపన్న దేశాలు వాతావరణ నిధులను పెంచాలని, కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించాలని చైనా బృందం తెరవెనుక చర్చల్లో డిమాండ్ చేస్తూనే, శిలాజ ఇంధనాల దశలవారీ తొలగింపునకు నిర్దిష్ట లక్ష్యాలను మాత్రం వ్యతిరేకిస్తోంది. చారిత్రకంగా పాశ్చాత్య దేశాలు ఎక్కువ ఉద్గారాలు విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశంగా చైనా ఉంది. అదే సమయంలో సౌర ఫలకాలు, పవన విద్యుత్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో అగ్రగామిగా నిలుస్తూ గడిచిన ఏడాదిలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలకు 132 బిలియన్ డాలర్ల విలువైన స్వచ్ఛ సాంకేతికత, పెట్టుబడులను అందించింది.
హరిత సాంకేతికతలో ముందున్నా, అధికారిక వాతావరణ నాయకత్వం వహిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని బీజింగ్ భావిస్తోంది. కాప్ సదస్సులకు ఆతిథ్యం ఇస్తే మరింత కఠినమైన వాతావరణ లక్ష్యాలను ప్రకటించాల్సిన ఒత్తిడి పెరుగుతుందని, దీనిని దేశంలోని భారీ బొగ్గు రంగ వర్గాలు వ్యతిరేకిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై మరింత ఆర్థిక సహాయం అందించాలన్న డిమాండ్లు తలెత్తే అవకాశం ఉందని, పేద అభివృద్ధి చెందుతున్న దేశాలతో తమను ఒకే గాటన కట్టే పాత చర్చ మళ్లీ తెరపైకి వస్తుందని బీజింగ్ ఆలోచిస్తోంది. పునరుత్పాదక సాంకేతికతలో తాము ఇప్పటికే ముందున్నామని, ప్రత్యేకంగా సదస్సు బాధ్యతలు ఎందుకు తీసుకోవాలనే ధోరణి చైనా కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది.
వాతావరణ రాజకీయాలకు బదులుగా వాణిజ్య అంశంలో మాత్రం చైనా తన పాత్రను చురుగ్గా పెంచుకుంటోంది. అంటాల్యా చర్చల్లో గ్రీన్ ట్రేడ్ స్వేచ్ఛా ప్రవాహానికి సంబంధించిన అంశాన్ని చేర్చాలని చైనా ప్రతినిధులు పట్టుబట్టారు. తమ స్వచ్ఛ ఇంధన సాంకేతిక పరిశ్రమలకు అంతర్జాతీయంగా ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉండగా, వాతావరణ నిబంధనల పేరుతో అమెరికా, యూరోపియన్ యూనియన్ విధిస్తున్న సుంకాలు, వాణిజ్య ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజింగ్ భావిస్తోంది. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా కఠిన సుంకాలు విధించగా, యూరోపియన్ యూనియన్ కూడా స్వచ్ఛ సాంకేతికతలపై ఆంక్షలు, అధిక కర్బన దిగుమతులపై పన్నులు అమలు చేస్తోంది. ఏకపక్ష ధోరణులు, రక్షణాత్మక వాణిజ్య విధానాలను సదస్సులో పరిష్కరించాల్సిన అవసరం ఉందని చైనా ప్రతినిధి బృందం అధిపతి లి గావో స్పష్టం చేశారు.