పాలస్తీనా అనుకూల అమెరికా మీడియా వారసుడికి స్పెయిన్ కోర్టు ఊరట
సూర్య అంతర్జాతీయ డెస్క్: పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా వ్యాపార కుటుంబ వారసుడు జేమ్స్ కాక్స్ ఛాంబర్స్ జూనియర్‌కు స్పెయిన్ న్యాయస్థానం తాత్కాలిక ఊరటనిచ్చింది. అమెరికా అప్పగింత అభ్యర్థనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కీలకంగా మారిన అమెరికా దర్యాప్తు అధికారి వాంగ్మూలం స్పానిష్ అనువాదంలో తీవ్రమైన పొరపాట్లు చోటుచేసుకున్నట్లు గుర్తించడం కోర్టు నిర్ణయానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామం అంతర్జాతీయ న్యాయ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
జేమ్స్ కాక్స్ ఛాంబర్స్ జూనియర్‌ను జూలై 10న స్పెయిన్‌లోని ఇబిజా దీవిలో అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు, అల్లర్లకు కుట్ర, అంతర్జాతీయ మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు కోరుతున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఛాంబర్స్ ఖండిస్తున్నారు. 2023లో అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విషయాన్ని అంగీకరించినప్పటికీ, ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు అందించిన మానవతా సహాయం, తన రాజకీయ అభిప్రాయాల కారణంగానే ఈ కేసు నమోదైందని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
అప్పగింతకు సంబంధించిన అమెరికా పత్రాల స్పానిష్ అనువాదంలో గణనీయమైన, ఉద్దేశపూర్వకంకాని పొరపాట్లు జరిగినట్లు అమెరికా అధికారులు అంగీకరించారని కోర్టు పేర్కొంది. ఈ తప్పులు కేసులోని ఆరోపణల స్వరూపం, తీవ్రతను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. దీంతో అప్పగింత అభ్యర్థనలోని సమాచార ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామం నేపథ్యంలో ఛాంబర్స్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
అయితే బెయిల్ మంజూరుతో కేసు పూర్తిగా ముగిసినట్లు కాదు. ఛాంబర్స్ ప్రతి వారం పోలీసుల ఎదుట హాజరుకావాలి, తన పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలి, స్పెయిన్ దేశం విడిచి వెళ్లకూడదు. తన నివాస చిరునామాను అధికారులకు తెలియజేయడంతో పాటు, కోర్టు ఆదేశించినప్పుడు విచారణకు హాజరుకావాలి. అమెరికాకు అప్పగించాలా వద్దా అనే అంశంపై స్పెయిన్ న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అప్పగింతకు కోర్టు అనుమతి ఇచ్చినా, తుది నిర్ణయం మాత్రం స్పెయిన్ మంత్రివర్గం చేతిలో ఉంటుంది.