చిప్స్ లో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:
చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (చిప్స్) ఆధ్వర్యంలో గ్రంథాలయ విభాగం, ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్తంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాయి. విద్యార్థులలో పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడం, విజ్ఞానాన్ని పంచుకోవడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పుస్తక సమీక్ష (బుక్ రివ్యూ) పోటీలు నిర్వహించారు. అలాగే వివిధ విజ్ఞాన, విద్యా గ్రంథాలతో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన విద్యార్థులు, అధ్యాపకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జగన్నాథ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పుస్తకాలు మనిషి వ్యక్తిత్వ వికాసానికి, లక్ష్య సాధనకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విద్యాధర మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ మాధ్యమాలతో పాటు గ్రంథాలయాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుని సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ విభాగ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆళ్ల వీరభద్ర రావు, సీనియర్ జర్నలిస్ట్, గుంటూరు.