రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి
నరసరావుపేట : గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం నరసరావుపేటలో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ సిగరెట్లను పట్టుకున్నారు. పట్టణంలోని వాసవి కాంప్లెక్స్ ఎదుట విజిలెన్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించి, సుమారు రూ.1 కోటి 15 లక్షల విలువైన సిగరెట్లతో వెళ్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు, సరైన పత్రాలు లేకుండా సిగరెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా సిగరెట్లను అక్రమంగా రవాణా చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. భారీ మొత్తంలో అక్రమ సిగరెట్లు పట్టుబడటంతో పట్టణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జిఎస్టి అధికారులు వీఆర్వో నాగేశ్వరరావు విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి