ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం
గుంటూరు జిల్లా క్రైమ్, మేజర్ న్యూస్:
సీపీఎస్ నుంచి ఓపీఎస్ పెన్షన్ విధానానికి మారేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ప్రస్తుతం పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు ఈరోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ఐ అడ్మిన్ సమక్షంలో జిల్లా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి, తమకు ప్రయోజనం కలిగించే ఈ నిర్ణయానికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పాత పెన్షన్ విధానానికి మార్పు నేపథ్యంలో సిబ్బందికి న్యాయపరంగా లభించాల్సిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరి సర్వీస్ బుక్‌లో అవసరమైన ఎంట్రీలు నమోదు చేయించి, సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన సిబ్బందికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ తెలిపారు.