క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు
కావలి, మేజర్ న్యూస్ : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలని కావలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఏ. గీతావాణి పిలుపునిచ్చారు. 'సురక్షిత బాల్యం - బాలల రక్షణ ఉద్యమం' (సురక్షిత్ బచపన్ అభియాన్) వారోత్సవాల సందర్భంగా శుక్రవారం స్థానిక వెంగళరావు నగర్‌లోని ఏపీ బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి గీతావాణి మాట్లాడుతూ, 14 ఏళ్ల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో ఉండాలన్నారు. బాలికలు విద్యా హక్కు చట్టంపై అవగాహన పెంచుకొని, కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించడం ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చిన్న వయసులో వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించిన ఆమె, 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బడి బయట ఉన్న బాలికలు గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చేరి చదువును కొనసాగించాలని కోరారు.
ఈ సదస్సులో లీగల్ ఎయిడ్ సభ్యులు ఐ. సాయి ప్రసాద్, లోక్ అదాలత్ సభ్యులు ఎం. మాలకొండారెడ్డి, మహిళా న్యాయవాదులు జె. శ్రీదేవి, వి. జయలక్ష్మి, హాస్టల్ వార్డెన్లు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.