ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్
పులివెందుల మేజర్ న్యూస్:
తన ఊపిరి ఉన్నంతవరకు చట్టాలను గౌరవిస్తానని, చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తానని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థులందరికీ నామినేషన్లు వేయించే బాధ్యత పోలీసులదేనని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించామని, తప్పనిసరిగా నామినేషన్లు వేయించేలా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే సీఐ సూచనలను పట్టించుకోకుండా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాళ్ల దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పారు.
తనపై దాడి జరిగిందని ఎంపీ మీడియా ముందు ఆరోపిస్తున్నారని, పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పటికీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఎందుకు ఇవ్వడం లేదని డీఎస్పీ ప్రశ్నించారు. బాధితుడు స్వయంగా అందుబాటులో ఉన్నప్పుడు ఫిర్యాదు తీసుకోకుండా సుమోటో కేసు నమోదు చేయాలని కోరడం సరికాదన్నారు.
ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఎంపీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. చట్ట ప్రకారం 151 సీఆర్పీసీ కింద అరెస్టు చేసి, నోటీసులు అందజేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారిని తోసుకుంటూ రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌లో జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీలు, సీసీ కెమెరాలు, ఇతర రికార్డులు ఉంటాయని, ఏదైనా ఘటన చోటుచేసుకుంటే న్యాయస్థానానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఎవరూ ఉద్రిక్తతలకు తావివ్వకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ మురళి నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పి. కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా