telanagana
సింగరేణి డిస్పెన్సరీలో ఫార్మసిస్టుల ఇష్టారాజ్యం! - రిటైర్డ్ కార్మికుల ఆవేదన..
సూర్య, మందమర్రి : సుదీర్ఘకాలం సింగరేణి సంస్థకు సేవలందించి పదవీ విరమణ పొందిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతను కొందరు సిబ్బంది విస్మరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మందమర్రి ఏరియాలోని కేకే 1 డిస్పెన్సరీలో కొందరు ఫార్మసిస్టుల వ్యవహారశైలి రోగులకు ఇబ్బందికరంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో వచ్చేవారికి మందులు అందించడంతో పాటు, వాటిని ఎలా వాడాలో వివరించి భరోసా కల్పించాల్సిన సిబ్బంది.. ప్రశ్నించిన రోగులపైనే చిర్రుబుర్రులాడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఆస్పత్రి సేవలపై చర్చకు దారితీస్తున్నాయి.
- విశ్రాంత కార్మికులంటే చిన్నచూపా..? సింగరేణి అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు శ్రమించిన విశ్రాంత కార్మికుల్లో చాలామంది వయోభారంతో పాటు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఎక్కడెక్కడో స్థిర పడినవారు ప్రతినెలా మందుల కోసం డిస్పెన్సరీకి వస్తున్న వీరితో ఓపికగా వ్యవహరించాల్సిన సిబ్బంది, కనీస మర్యాద పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య పరిజ్ఞానం, మందుల పేర్లు తెలియని వృద్ధులకు వివరించి చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి, వారిపైనే అసహనం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవితంలో అత్యధిక కాలం సంస్థకే అంకితం చేసిన కార్మికులు వృద్ధాప్యంలో వైద్య సేవల కోసం వచ్చి అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం విచారకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.