సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి.. మంచిర్యాలలో ప్రజా సంఘాల ఆందోళన
సూర్య మంచిర్యాల టౌన్: ఓట్ల ప్రక్షాళన పేరుతో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్–సర్) ప్రక్రియను రద్దు చేసి, ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న యువత ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్య ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించే విధంగా సర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన భారతీయుల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చొరబాటుదారులను గుర్తించి తొలగిస్తామనే పేరుతో ప్రారంభించిన ప్రక్రియలో నిజమైన ఓటర్ల ఓట్లు తొలగించబడటం ఆందోళనకరమని నాయకులు అన్నారు. ఎన్నికల కమిషన్‌ను అధికార పక్షం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి ఓట్లను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు పునరుద్ధరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని తెలిపారు. ఫారం-6లో ఎన్నికల కమిషన్ చేసిన మార్పులపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తినట్లు పేర్కొన్నారు.ప్రజల పన్నుల రూపంలో సమకూరిన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజల హక్కులను కాలరాయడం తగదని హితవు పలికారు.ఈ నిరసన కార్యక్రమంలో పౌర స్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం,బీసీ మేధావుల ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, జైభారత్ జిల్లా కన్వీనర్ కాసిపేట రాజేశం, తెలంగాణ జన సమితి నాయకుడు ప్రదీప్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు జైపాల్ సింగ్, జై భారత్ మహిళా కమిటీ కన్వీనర్లు హసీనా, రజియా, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు దేవి పోచయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి డూర్కె మోహన్, విద్యార్థి జేఏసీ నాయకుడు చిప్పకుర్తి శ్రీనివాస్,సింగరేణి జేఏసీ నాయకుడు పెద్దపల్లి కోటలింగం, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్యతో పాటు సామాజిక ఉద్యమకారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.