హమాలీల భద్రత మా బాధ్యత
హమాలీలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తాం
లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు అందేలా చర్యలు
వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5):
వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీల సంక్షేమం, భద్రతకు మార్కెట్ కమిటీ పూర్తి బాధ్యత వహిస్తుందని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. సోమవారం మార్కెట్ యార్డులో వైస్ చైర్మన్ మల్లేశం ఆధ్వర్యంలో హమాలీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హమాలీల సమస్యలను చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ తరఫున ప్రతి హమాలీకి రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వం అందించే కార్మిక బీమా కార్డులు ప్రతి హమాలీకి అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.హమాలీలకు సంబంధించిన వివిధ సమస్యలపై సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలుదారులు, హమాలీలు సమన్వయంతో పనిచేసి మార్కెట్ కార్యకలాపాలకు సహకరించాలని కోరారు.త్వరలో మార్కెట్ కమిటీ తరఫున హమాలీలకు నూతన వస్త్రాలు అందజేస్తామని తెలిపారు. హమాలీల సంక్షేమానికి అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో హమాలీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.