బ్యాంక్ అధికారినంటూ మోసం నిందితుడి అరెస్ట్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:నిందితుడు చైతన్య ప్రమోద్ కుటే బ్యాంక్ అధికారినంటూ ప్రజలకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు మరియు ఓటీపీ లు సేకరించి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారుఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు చెందిన బాధితుడు ప్రఫుల్ పాటిల్కు 2026 జూలై నెలలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, అతని క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తామని నమ్మించి సైబర్ మోసానికి పాల్పడి రూ.73,279/- కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ఎన్ సి పి పి పోర్టల్ ద్వారా లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఆదిలాబాద్ 1 టౌన్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మహారాష్ట్రకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
పోలీసుల విచారణలో నిందితుడు తాను గతంలో ఆక్సిస్ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో కస్టమర్లతో మాట్లాడిన అనుభవాన్ని ఉపయోగించుకుని, బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన మొబైల్ నంబర్లను సేకరించినట్లు తెలిపాడు. అనంతరం వివిధ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బ్యాంక్ అధికారులమంటూ కస్టమర్లకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఓటీపీ లను తెలుసుకుని డబ్బులను వివిధ యూపీ ఐ , అమెజాన్ ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు తెలిపాడు.నిందితడు తెలంగాణ, మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలలో దాదాపు 150 మంది బాధితుల వద్ద రూ 95,33,651/- నగదు నష్టపోయినట్లు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నందు ఫిర్యాదులను నమోదు అయినట్లు తెలిపారు.
అదేవిధంగా 23.07.2026న బాధితుడికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నమ్మించి, ఓటీపీ లను తెలుసుకుని ఐదు లావాదేవీల ద్వారా మొత్తం రూ.73,279/- బదిలీ చేసుకున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుడు మోసాలకు ఉపయోగించినట్లు తెలిపిన మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడించాడు. అలాగే వివిధ మొబైల్ నంబర్లతో సిమ్ కార్డులు మార్చుతూ, మొబైల్ ఫోన్లు మార్చుతూ సైబర్ మోసాలకు పాల్పడినట్లు తెలిపాడు.నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రజలు బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు లేదా ఇతర సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ , పిన్ , సీవీవి , క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.ఈ కార్యక్రమం నందు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐ లు గోపికృష్ణ, అశోక్, మరియు పోలీసు సిబ్బంది, సైబర్ క్రైమ్ కీలకంగా వ్యవహరించారు.