గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సూర్య జగిత్యాల ప్రతినిధి:సోమవారం జిల్లా కలెక్టరేట్ లో కాన్ఫరెన్స్ హాల్ లో గోదావరి పుష్కరాలు–2027 పై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ధర్మపురి, కోటిలింగాల తదితర పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.జగిత్యాల జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉన్నందున రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ధర్మపురి పుష్కర ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పలు శాఖలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, మొత్తం రూ.226.41 కోట్ల మేర వివిధ శాఖల పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఎండోమెంట్స్, ఇరిగేషన్, పీఆర్‌ఈడీ, ప్రజారోగ్యం, నీటి సరఫరా–పారిశుధ్యం, టూరిజం, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలకు సంబంధించిన పనులు వివరాలు సంబంధిత అధికారులు వివరించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ
జగిత్యాల నియోజకవర్గం లో బోర్నపెల్లి, కమ్మునూరు, చిత్రవేణి గూడెం మరియు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా గోదావరి పుష్కర స్నానాలకు వచ్చే ప్రజలకు, భక్తులకు కావలసిన వసతులు, పుష్కఘాట్లు, రోడ్లు, విధ్యుత్ పనులను వేగవంతం చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని పుష్కర ఘాట్లు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య, పోలీస్ తదితర ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతున్నామని తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని ధర్మపురి, వెల్గటూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్‌పూర్, రాయికల్ మండలాల్లోని పుష్కర ఘాట్లకు సంబంధించి ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అవసరమైన చోట కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు.ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో ఘాట్ల అభివృద్ధికి ఇరిగేషన్ శాఖ ద్వారా పనులు చేపడుతున్నామని, ధర్మపురి వద్ద 470 మీటర్ల మేర కొత్త ఘాట్లు, కోటిలింగాల వద్ద 210 మీటర్ల మేర కొత్త ఘాట్లకు సంబంధించిన పనులు మంజూరయ్యాయని తెలిపారు.ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కోటిలింగాల ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు ఎండోమెంట్స్ శాఖ ద్వారా చెరో రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరై పనులు ప్రారంభమైనట్లు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ధర్మపురి మున్సిపాలిటీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్ల మేర పనులు చేపడుతున్నామని, అదేవిధంగా నీటి సరఫరా, పారిశుధ్య సౌకర్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.పుష్కరాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తుల భద్రతకు అవసరమైన పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరాలు తదితర అంశాలకు కూడా ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు.పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ప్రతి పనిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కర అనుభవం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమీక్ష లో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, మెట్ పెల్లి ఆర్డీవో నరసింహ రావు, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, పంచాయతీ రాజ్, రోడ్డు భవనాల శాఖ అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.