గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల
లక్క వరపు కోట , అక్టోబర్ 05 మేజర్ న్యూస్ :
గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట మండలం గొల్జాం గ్రామంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ.22.95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న 14 గోకులం షెడ్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పాడి రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు, మూగజీవాల సంరక్షణకు ఈ గోకులం షెడ్లు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. అర్హులైన రైతులందరూ ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT) నిధులు రూ.45 లక్షలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి ట్యాంక్ (ఓహెచ్‌ఎస్‌ఆర్) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. జలజీవన్ మిషన్- అమరజీవి జలధార ప్రాజెక్టు కింద ఎస్ కోట నియోజకవర్గానికి రూ.233.49 కోట్లు మంజూరయ్యాయని.. పనులు అధికారికంగా ప్రారంభించనట్టు తెలిపారు. ట్యాంక్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, ఏ ఎం సి చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, క్లస్టర్ ఇంచార్జీ కొల్లి వెంకట రమణ మూర్తి, కోళ్ల భూపాల్ నాయుడు, తూర్పటి రామారావు, అక్కిరెడ్డి వెంకట రమణ, పవన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.