క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు
ప్రొద్దుటూరు అక్టోబర్ 6 మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలు, క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పోలీసు అధికారులతో చర్చించారు. ఏఎస్పీ విభూకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పట్టణంలోని 52 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. సిబ్బంది ఇంటికి వచ్చిన వివరాలు క్యూ ఆర్ కోడ్ ద్వారా నమోదు కానుండగా, సేవ అందించిన ప్రాంతాలు, సిబ్బంది, వాహన నంబర్, సమయం వంటి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని కమీషనర్ తెలిపారు. ఏఎస్పీ విభూకృష్ణ మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం పట్టణంలో సుమారు 120 సీసీ కెమెరాలు ఉన్నాయని, నేరాల పర్యవేక్షణ, నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 400 పాయింట్లలో కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్య పర్యవేక్షణకు ఏర్పాటు చేసే కెమెరాలు నేరాల నియంత్రణకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి, టూటౌన్ సీఐ వంశీనాథ్, త్రీటౌన్ సీఐ రామాంజనేయుడు, ఏఎంసీ మంజునాథ గౌడ్, ఏసీపీ, టీపీఓ, శానిటేషన్ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా