వసతులు కరువైన బస్టాండ్
వసతులు కరువైన బస్టాండు
--సమస్యలపట్ల స్పందించని అధికారులు
--ఆగ్రహిస్తున్న ప్రయాణీకులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు పట్టణంలో అధునాతనంగా నిర్మించిన బస్టాండ్ లో కనీస వసతులు కరువై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులెవరూ స్పందించడంలేదు. ప్రయాణీకులు ఆగ్రహిస్తున్నారు. ఇది ప్రజా సమస్య కాదా అని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు.గతంలో ఉన్న బస్టాండ్ తొలగించి నాలుగేళ్ల క్రితంఅప్పటి ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి తన అన్న దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఎంజిఆర్ ఫౌండేషన్ ద్వారా దాదాపు నాలుగు కోట్లుతో ఈ బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్కు మున్సిపల్ ని ధులు కూడా వెచ్చించారన్నవిమర్శలు కూడా ఉండగా బస్టాండ్ ను అధునాతంగా నిర్మించారే కానీ సౌకర్యవంతంగా నిర్మించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా గత ప్రభుత్వంలో మంత్రులు చేతులు మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభించారు. అయితే బస్టాండ్ మున్సిపాలిటీకి గాని ఆర్టీసీకి గాని స్వాధీనం చేయలేదంటున్నారు. కనీస వసతులు కరువై ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం త్రాగునీటి సౌకర్యం కల్పించక పోగా ఈ పరిస్థితిని గమనించిన నిత్యాన్నదాత శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర్ రెడ్డి శీతల తాగునీటిని, మజ్జిగను నిరంతరాయంగా సరఫరా చేసేలా ఏర్పాటు చేశారు. వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇక్కడ నుండి రాకపోకలు సాగిస్తూ బస్సులు కోసం వేచి ఉంటుంటారు. కేవలం 36 కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేయగా వాటిల్లో కొన్ని దెబ్బ తిన్నాయి. కనీసం బెంచీలు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో ప్రయాణికులు అధికంగా నేలపైనే కూర్చొని, నిలబడి వేచి ఉంటుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం అంటూ దుకాణాల కోసం అధికంగా గదులు నిర్మించగా కొన్నింటి మాత్రమే ప్రారంభించగా మిగతావి తలుపులు వేయబడి దర్శనమిస్తున్నాయి. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం భోజన, ఫలహారాల సౌకర్యం కల్పించలేదు. బస్టాండ్ లో ప్రయాణికుల కోసం ఒకవైపు మాత్రమే అవకాశం కల్పించగా ప్రయాణికులు అధికంగా ఉన్న సమయంలో ఇరుగ్గా ఉంటుంది. సాయంత్రం సమయంలో విద్యార్థులు, ప్రయాణీకులతో బస్ స్థాండ్ కిటకిటలాడుతూ నిలబడేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి కన్పిస్తోంది.వర్షం సమయంలో గాలికి వర్షపు నీరు కూడా లోపలికి వెదజల్లుతుంటాయి. ఈ బస్టాండ్లో ప్రయాణికులకు ఎవరు వసతులు కల్పించాలనే విషయమే స్పష్టత లేకుండా ఉంది. మున్సిపాలిటీ నా, ఆర్టీసీ నా, నిర్మించిన ట్రస్టా అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు పరిశీలించి ప్రయాణికులకు తగిన కనీసం వసతులు కల్పించాలని సర్వత్ర కోరుతున్నారు.