పౌర సేవల్లో నాణ్యతకు ఉద్యోగుల సామర్థ్యమే కీలకం: సీఎం చంద్రబాబు
సూర్య అమరావతి బ్యూరో: పౌర సేవల్లో నాణ్యత పెంచడానికి ఉద్యోగుల సామర్థ్యం, నిరంతర నైపుణ్యాభివృద్ధే కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కార్యాలయంలో గృహ నిర్మాణం, సౌర విద్యుత్ మరియు ప్రజా సేవల పురోగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చే దిశగా రాబోయే రెండున్నరేళ్ల కాలంలో గృహ నిర్మాణ లక్ష్యాలను శతశాతం పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడరాదని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ (సోలార్ పవర్) కనెక్షన్లు అందించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తప్పడమే కాకుండా, పర్యావరణహిత హరిత ఇంధనానికి పెద్దపీట వేసినట్లవుతుందని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందేలా ఉద్యోగులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పాలనా నైపుణ్యాలలో నిరంతర శిక్షణ అందించాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా అందుతున్న డేటా ఆధారంగా ప్రతి పథకం అమలును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తికర స్థాయిని కొలమానంగా తీసుకుని ప్రజాపాలనను సరికొత్త శిఖరాలకు చేర్చాలని అధికారులకు స్పష్టం చేశారు.