విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్
అమలాపురం మేజర్ న్యూస్ :డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రజలు విదేశాలకు వెళ్లే సమయంలో మోసాలకు గురికాకుండా, సరైన సమాచారం మరియు అవగాహనతో చట్టబద్ధమైన మార్గంలో విదేశాలకు వెళ్లేలా మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ పనితీరుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల మంగళవారం సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు అందించిన సేవలు, నమోదైన కేసులు, పరిష్కరించిన సమస్యలు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు, విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలసదారులకు అందిస్తున్న సహాయం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముందుగానే సంబంధిత దేశంలోని ఉద్యోగం, వీసా, నియామక సంస్థ, ఏజెంట్, జీతభత్యాలు, వర్క్ పర్మిట్ తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. సరైన సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే పరిస్థితులు రాకుండా ముందస్తు అవగాహన కల్పించడంలో మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషించాలని తెలిపారు.మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌కు వస్తున్న కేసుల స్వభావం, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల సమన్వయంతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవసరమైన సందర్భాల్లో ఏపీ ఎన్ఆర్టీ సహకారాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ మేనేజర్ గోళ్ళ రమేష్ మాట్లాడుతూ, సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 400కు పైగా కేసులు నమోదు కాగా, వాటిలో 270కు పైగా కేసులకు పరిష్కారం చూపించినట్లు తెలిపారు. మిగిలిన కేసులను కూడా సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
విదేశాలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ను సంప్రదించి తమ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని సెంటర్ నోడల్ అధికారి వీర్ల సుబ్బారావు సూచించారు. సెంటర్ సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారని, వారి మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చని తెలిపారు.మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ద్వారా వలసదారులకు అందిస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ అభినందించారు. సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో సేవలు కొనసాగించాలని సూచించారు.
ప్రతినెలలో 15 రోజులకోసారి జిల్లా రెవిన్యూ అధికారితో సమన్వయం చేసుకొని మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ రివ్యూ మీటింగ్ జరుపుకోవాలని ఎం ఎం సి పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ మేనేజర్ గోళ్ళ రమేష్, పీడీ–ఐసీడీఎస్ కె. నాగమణి, ఎస్‌జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి విజయలక్ష్మి, డిపి ఆర్ ఒ సిహేచ్ శ్రీనివాస్,కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగలక్ష్మమ్మ, కడియాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.