ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు.
అనపర్తి మేజర్ న్యూస్.అనపర్తి: అనపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత విస్తరిస్తూ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సేవలను కూడా అందిస్తున్నారు. ప్రతి బుధవారం, శుక్రవారం మానసిక వైద్యులు అనపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, నిరాశ, కుటుంబ సమస్యలు, విద్యా మరియు ఉద్యోగ సంబంధిత ఒత్తిడి వంటి సమస్యలు అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయని వైద్యులు తెలిపారు.
మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగి ఉండటంతో పాటు సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం బృందం ప్రజలకు మానసిక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో నిపుణుల సలహా, చికిత్స అందించనున్నారు.మానసిక ఆరోగ్యం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందని వైద్యులు వివరించారు
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు సంకోచం లేకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సహాయం కోసం అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్ 14416ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, వైద్యులు పిలుపునిచ్చారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్యంపై మార్గదర్శకత్వం పొందేందుకు ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిలేంద్ర శ్రీనివాస్, డాక్టర్ చంద్రబోస్, క్లినికల్ సైకాలజిస్ట్ ప్రియాంక రాణి, సైకాలజిస్ట్ నర్స్, అనపర్తి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.