పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం
విజయవాడ, మేజర్ న్యూస్ : కెనడాలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన క్రీడాకారుడు సంకు కృపారావు బంగారు పతకం సాధించి ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చారు. అంతేకాకుండా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్‌గా నిలిచారు. అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం కోరుతూ కృపారావు కుటుంబం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశను ఆశ్రయించగా, ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆయన పీ4 కార్యక్రమం ద్వారా రూ.లక్ష ఆర్థిక సహాయం అందేలా సెంటిని బయో ప్రొడక్ట్స్ సంస్థను అనుసంధానించారు. బుధవారం కలెక్టరేట్‌లో కృపారావును అభినందించిన కలెక్టర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.