ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక
విజయవాడ పశ్చిమ, మేజర్ న్యూస్ : ప్రజా సమస్యల పరిశీలనకు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ మాజీ కార్పొరేటర్లు హెచ్చరించారు. బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు యలకల చలపతిరావు, మండేపూడి ఛటర్జీ, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయత్, 53వ డివిజన్ అధ్యక్షుడు గురుమహంతు మహేష్ తదితరులు మాట్లాడారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వెలంపల్లి శ్రీనివాసరావును అడ్డుకోవడం సరికాదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు జరిగాయని తెలిపారు. 45వ డివిజన్‌లోని ప్రజా సమస్యలపై కూడా తమ పోరాటం కొనసాగుతుందని, బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకాలు కల్పించడం సరికాదని, ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.