పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం
కడియం, మేజర్ న్యూస్, :కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ‘మీ మార్ట్’ను కడియం మండలం జేగురుపాడు గ్రామంలో కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు.
ఈ మార్ట్‌లో ప్రజలకు అవసరమైన వివిధ నిత్యావసర సరుకులు ఒకే చోట లభించడంతో పాటు, ప్రతి కొనుగోలుపై మూడు నుంచి ఐదు రూపాయల వరకు కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నాయకులు తెలిపారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ పాతూరి రాజేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి సూర్య రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సరుకులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, రేషన్ దుకాణాల్లో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
కార్యక్రమంలో నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, పాతూరి రాజేష్, కర్రి చినబాబు, మాదారపు సూర్యనారాయణ, బొబ్బా భాస్కరరావు, రంకిరెడ్డి చిట్టియ్య, వనమాలి వీరకృష్ణ, పెరుగు నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కూటమి నాయకత్వం వర్ధిల్లాలని ప్రజలు కరతాళ ధ్వనులతో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.