విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి: సబ్‌స్టేషన్ ఎదుట బిఆర్ఎస్, రైతుల ధర్నా
నెక్కొండ, అక్టోబర్ 06 మేజర్ న్యూస్ (సూర్య):
మండలంలోని రెడ్లవాడ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ గురువారం బిఆర్ఎస్ నాయకులు, స్థానిక రైతులు నిరసన బాట పట్టారు. రెడ్లవాడ, గొట్లకొండ, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట కరెంట్ లేక తీవ్ర చీకటితో పాటు దోమల పోటుతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, రైతులను ఏడిపించిన ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు.
అలాగే రెడ్లవాడ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిని తక్షణమే విధులనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు వచ్చి సమస్యను త్వరలోనే చక్కదిద్దుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇచ్చిన హామీని విస్మరిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, రెడ్లవాడ సర్పంచ్ గాంధీ, నాయకులు సూరం రాజ్ రెడ్డి, మూదాసు రవి, బొల్లెబోయిన వీరస్వామి, కొసుసోతు వెంకన్న, కారింగుల సురేష్, దేవనబోయిన వీరభద్రయ్య, పొడిశెట్టి సత్యం, ఈదునూరి వెంకన్న, ఠాగూర్ కిషన్, బాణోత్ ప్రవీణ్, అజ్మీర సుమన్, భూక్య రమేష్, భూక్య సుమన్, నేతావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.