దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు...
సూర్య ఆరోగ్య, సైన్స్ డెస్క్: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణలో భారతదేశం సరికొత్త అంతర్జాతీయ మైలురాయిని అధిగమించింది. పూణేకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (SII) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి జెండర్-న్యూట్రల్ క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (qHPV) టీకా ‘సెర్వావాక్’ (Cervavac) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అత్యున్నత 'ప్రీక్వాలిఫికేషన్' (Prequalification) హోదాను దక్కించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులకు మాత్రమే లభించే ఈ గుర్తింపు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సాధించిన 32వ డబ్ల్యూహెచ్‌వో ప్రీక్వాలిఫికేషన్ కావడం విశేషం.
ఈ డబ్ల్యూహెచ్‌వో ఆమోదంతో ‘సెర్వావాక్’ టీకాను యునిసెఫ్ (UNICEF), పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) వంటి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంస్థలు నేరుగా పెద్దఎత్తున కొనుగోలు చేసి, తక్కువ మరియు మధ్యతరగతి ఆదాయ దేశాలకు సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇప్పటికే ఆమోదించిన ఈ టీకా.. హెచ్‌పీవీ టైప్ 6, 11, 16 మరియు 18 రకాల వైరస్‌లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సు గల బాలికలు, మహిళలతో పాటు బాలురు, పురుషులకు కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్, యోని క్యాన్సర్లు మరియు పురుషుల్లో గుద క్యాన్సర్, జననేంద్రియ మొటిమలను (జెనిటల్ వార్ట్స్) నివారించడంలో ఈ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ప్రయోగాల్లో తేలింది.
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (DBT), బైరాక్ (BIRAC), బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన ఈ వ్యాక్సిన్.. అంతర్జాతీయ మార్కెట్లలో లభించే ఖరీదైన విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల్లో అధిక శాతం భారత్‌తో సహా వర్ధమాన దేశాల్లోనే ఉండటంతో, సెర్వావాక్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించడం ప్రపంచ క్యాన్సర్ నివారణ పోరాటంలో ఒక విప్లవాత్మక అడుగుగా అంతర్జాతీయ వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.