లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ఏపీఎస్‌ఆర్టీసీ పండిట్ నెహ్రూ బస్టాండ్, లో బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం కోసం ఏపీఎస్‌ఆర్టీసీతో సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మంగళవారం సాయంత్రం బస్టాండ్‌లోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్‌తో ఆయన సమావేశమయ్యారు. భారీ వర్షాల సమయంలో బస్టాండ్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే నీటితో పాటు రహదారిపై చేరే వర్షపు నీరు లో బ్రిడ్జి వద్దకు చేరుతుండటంతో పెద్దఎత్తున నీరు నిలిచిపోతోందని తెలిపారు. ప్రస్తుతం అక్కడి డ్రైనేజీ పంపింగ్ కేంద్రం రహదారిపై చేరే వర్షపు నీటిని మాత్రమే తొలగించే సామర్థ్యంతో ఉందని, బస్టాండ్ పరిధిలో ప్రత్యేకంగా వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడంతో అదనపు నీరు కూడా రహదారి వైపు చేరి పంపింగ్ కేంద్రంపై భారం పెరుగుతోందని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బస్టాండ్‌లోని వర్షపు నీటిని ప్రత్యేకంగా నిర్వహించడంతో పాటు లో బ్రిడ్జి వద్ద అవసరమైన పంపింగ్, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఇరుశాఖల అధికారులు సమన్వయంతో సాంకేతికంగా సాధ్యమైన ఉత్తమ పరిష్కారాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని లేఖ ద్వారా తెలియజేసినట్లు కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.