దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం
సూర్య వేములవాడ రూరల్, విద్యుత్ వేలుగుల్లో భీమేశ్వరుడి ఆలయం: ముమ్మరంగా ఉత్సవ ఏర్పాట్లు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) పర్వదినాల నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలు, సీరియల్ సెట్లు, హై-మాస్ట్ ఫోకస్ లైట్లతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కొలువుదీర్చేందుకు ప్రత్యేక పూజా మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. మహిళా భక్తులు బతుకమ్మ ఆడటానికి, కోలాటం, దాండియా నృత్యాలు చేయడానికి వీలుగా భీమేశ్వర సదన్ వద్ద ఉన్న విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడ విద్యుత్ వెలువెలుగులతోటు భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ, బతుకమ్మ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవస్థానం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో రమాదేవి ఆదేశాల మేరకు ఆలయంలో జరుగుతున్న ముస్తాబు, అభివృద్ధి పనులను ఈఈ రాజేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.