దామరకుంటలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు-కనులపండువగా 21 తీరుల పూల గోపురాల ఆవిష్కరణ
కాటారం, మేజర్ సూర్య, తెలంగాణ అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు కాటారం మండల పరిధిలోని దామెర కుంట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగాయి. పల్లె సంస్కృతిని, సమిష్టి ఆనందాన్ని ప్రతిబింబిస్తూ గ్రామ ఆడపడుచులంతా ఒకే వేదికపైకి చేరి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మునుపెన్నడూ లేని రీతిలో, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఏకంగా 21 తీరుల (రకాల) బతుకమ్మలను రంగురంగుల దేశీయ పూలతో గోపురాల్లా తీర్చిదిద్ది ఉత్సవ ప్రాంగణంలో ప్రతిష్టించారు. తంగేడు, గునుగు, కట్ల, చామంతి, గులాబీ పూల సువాసనలతో దామరకుంట పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. సంప్రదాయ దుస్తులలో మెరిసిపోయిన మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, గౌరమ్మను కీర్తిస్తూ సాగిన పాటలు గ్రామీణ వైభవాన్ని ఆవిష్కరించాయి. ఈ వేడుకల్లో మహిళలు ప్రదర్శించిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిరునవ్వులు చిందిస్తూ, కోలాట కర్రల లయబద్ధ చప్పుళ్లతో సాగిన ఆటపాటలు ఉత్సవాల్లో సరికొత్త కోలాహలాన్ని నింపాయి. గ్రామ ఆడబిడ్డల ఆనందోత్సవాలు, కోలాటాల సవ్వడితో దామరకుంటలో పండగ వాతావరణం మిన్నంటింది. సమిష్టి భాగస్వామ్యంతో సాగిన ఈ వేడుకలు గ్రామంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
రిపోర్టర్: గోనె సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి