పూలనే దేవతగా పూజించే పండుగ “బతుకమ్మ” - జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. శారదాదేవి
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రకృతిలో లభించే పూలను బతుకమ్మగా పేర్చి దేవతగా పూజించే తెలంగాణ సంస్కృతి వైభవోపేతమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. శారదాదేవి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్.పి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు జిల్లా కలెక్టర్ కె.హరిత, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనంతలక్ష్మి, ఎస్.పి. నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలమణి లతో కలిసి హాజరై బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవాన్ని అందిస్తుందని తెలిపారు. ప్రకృతిలో సహజంగా లభించే వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించి, బతుకమ్మగా పేర్చి, దేవతా స్వరూపంగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం తెలంగాణలో ప్రత్యేకంగా కొనసాగుతోందని,
మనిషి జీవితం ప్రకృతితో మమేకమై ఉంటుందని బతుకమ్మ పండుగ చెబుతుందని, తెలంగాణ ప్రజల జీవన విధానానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ఈ పండుగ ప్రతిబింబమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి పట్ల గౌరవభావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించడంతో పాటు, మన ప్రాంతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.