దుర్గమ్మ అనుగ్రహంతో ప్రజలకు ఎల్ నీనో కష్డాలు వైదొలగాలి
*కొల్కులపల్లి దుర్గామాత ఉత్సవమండపంలో సర్పంచ్ భట్టు అనురాధకిషన్ రెడ్డి పూజలు*
ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండి భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రస్తుత తరుణంలో ఆదిపరాశక్తి దుర్గామాత అనుగ్రహంతో ప్రజలకు ఎల్ నీనో కష్టాలు వైదొలగాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు, మాడ్గుల మండలం కొల్కులపల్లి సర్పంచ్ భట్టు అనురాధకిషన్ రెడ్డి ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షంతో ఎల్ నీనో ఆపద నుండి ప్రజలంతా గట్టెక్కుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేవీశరన్నవరాత్రోత్సవాలలో భాగంగా కొల్కులపల్లి దుర్గామాత ఉత్సవమండపంలో మహా ఛండిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గామాతను పంచాయతి పాలకవర్గసభ్యులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి సర్పంచ్ అనురాధకిషన్ రెడ్డి సందర్శించి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఉత్సవకమిటి సభ్యులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అనురాధకిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతియేటా దేవీశరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవకమిటి సభ్యులను అభినందించారు. ప్రతియేడులాగే ఈ సంవత్సరం కూడ అమ్మవారి ఉత్సవాలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవనిర్వాహకులు, పంచాయతి పాలకవర్గసభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
--------
-ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల