పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మందికి రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం ఉదయం సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 29 డివిజన్లకు చెందిన 68 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.56.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు సకాలంలో సహాయం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత డివిజన్ల నాయకులు, పార్టీ ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.