నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరంలోని మాజీ సైనికులు గత 20 నుండి 25 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సైనిక్ భవన్ కల సాకారమైంది. నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో గల పాత తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైనిక్ భవన్ నిర్మాణ పనులకు బుధవారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, సైనిక సంక్షేమ శాఖ అధికారులు, మాజీ సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో సేవలు అందించిన మాజీ సైనికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత రెండు దశాబ్దాలుగా సైనిక్ భవన్ కోసం మాజీ సైనికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి.. ఈ రోజు పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చే మాజీ సైనికులు, అమర జవాన్ల కుటుంబాలు, వీరనారీలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, అర్జీలు ఇచ్చుకునేందుకు ఈ భవనం ఒక కేంద్ర బిందువుగా మారుతుందన్నారు.
మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి సంక్షేమ కార్యక్రమాలను చర్చించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ భవనాన్ని నిర్మించడం వల్ల రవాణా పరంగా అందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అంతపురం.