భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ రేసులో కనకరాజు సూరి కుమార్తె రోహిణి! జనసేన అభ్యర్థిగా తెరపైకి పేరు.. అధిష్ఠానం పరిశీలనలో బయోడేటా? క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కుమార్తెకు అవకాశం దక్కుతుందా?
భీమవరం, సూర్య న్యూస్: భీమవరం పురపాలక సంఘ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా వేగేశ్న రామ బంగారు రోహిణి పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కనకరాజు సూరి కుమార్తె కావడంతో ఆమె అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కనకరాజు సూరి రాజకీయ నేపథ్యం రోహిణి పేరుపై చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇప్పటికే ఆమె బయోడేటాను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం రోహిణి సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యావంతురాలిగా, ఉన్నత విద్యాసంస్థలో పనిచేస్తున్న వ్యక్తిగా ఆమె పేరు తెరపైకి రావడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా భావిస్తున్నారు.
రాజకీయంగా కీలకమైన ఎంపిక?
భీమవరం పురపాలక సంఘంలో చైర్పర్సన్ పదవికి అభ్యర్థి ఎంపిక జనసేన పార్టీకి కీలక అంశంగా మారనుంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, పార్టీ నాయకత్వం నిర్ణయం వంటి అంశాలు అభ్యర్థి ఎంపికలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కనకరాజు సూరి కుమార్తె రోహిణి పేరు పరిశీలనలో ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ!
రోహిణి పేరును పార్టీ అధికారికంగా ఖరారు చేస్తుందా? లేక ఇతర నాయకులకు అవకాశం కల్పిస్తుందా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే చైర్పర్సన్ అభ్యర్థిత్వంపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా