హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి:
హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: కకలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్
హొళగుంద (ఆలూరు): ప్రసిద్ధ దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి విజయదశమి బన్నీ ఉత్సవాలను భక్తి భావంతో, సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ.సిరి సూచించారు. ఈ నెల 21న జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
దేవరగట్టులో వివిధ శాఖల అధికారులతో, గ్రామాల భక్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, రవాణా తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బన్నీ ఉత్సవాల్లో కర్రల వినియోగం వల్ల ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు సంయమనం పాటించాలని, సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ పరస్పర సహకారంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. భద్రతా పర్యవేక్షణ కోసం డ్రోన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా జరిగేలా అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సమావేశంలో సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని ఏఎస్పీ జయశర్మ, ఆర్డీవో అరుణదేవి తదితరులు పాల్గొన్నారు