ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:
ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి నెల నిర్వహించే తనిఖీల్లో భాగంగా బుధవారం నంద్యాల పట్టణంలోని బెక్కె మార్కెట్ యార్డులో ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించార. గోదాముల తాళాలు, సీళ్ల పటిష్టత, సీసీ టీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలీసు లాగ్ బుక్ను పరిశీలించి విధు నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. సీసీ టీవీ కెమెరాలు నిరంతర పని చేసేలా చూడాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సబ్ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, నంద్యాల అర్బన్ తాహశీల్దార్ పత్తి సత్యశ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*