సర్వర్ డౌన్తో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్!
రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పడిగాపులు
రంగారెడ్డి : తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యతో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో భూముల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వస్తున్న వారు పనులు కాకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.
ఉదయం కార్యాలయానికి చేరుకుంటున్న రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాయంత్రం వరకు అక్కడే వేచి చూస్తూ పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని ఆశతో గంటల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో వారి ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.
రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో పెండింగ్లో ఉన్న దస్తావేజుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం సమయం కేటాయించుకున్న వారు, భూముల లావాదేవీలు పూర్తి చేయాల్సిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోజంతా కార్యాలయం వద్ద గడపాల్సి రావడంతో సమయం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ సమస్య తలెత్తినప్పుడు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారంపై స్పష్టత లేకపోవడంతో ఎప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరుతున్నారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేసి తమ ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
(వి శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్)