ఎన్నికల వేళ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి జిల్లా ఎస్పీ పి. జగదీష్
కళ్యాణదుర్గం (కళ్యాణదుర్గం ఇన్చార్జ్, మేజర్ న్యూస్) : రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బుధవారం కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయంలో స్థానిక పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, రూట్ మొబైల్ బృందాల నిఘా, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రౌడీషీటర్లు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
సమీక్షా సమావేశం అనంతరం కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, రాకపోకల మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, డీఎస్పీ టి. దైవప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మంజుల, అర్బన్ సీఐ హరినాథ్, రూరల్ సీఐ గంగాధర్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.